ముందుగానే పలకరించిన నైరుతి

Praja Tejam
0


  • కేరళలో విస్తారంగా వర్షాలు 
  • రెండు మూడు రోజుల్లో ఆంధ్రాకు 
  • 27న అల్పపీడనం

తిరువనంతపురం, అమరావతి బ్యూరో : దేశంలో వ్యవసాయ కార్యకలాపాలకు దోహదపడే నైరుతి రుతుపవనాలు కేరళను శనివారం పలకరించాయి. సాధారణంగా జూన్‌ 1నాటికి రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయి. ఈసారి భారత వాతావరణ శాఖ అంచనా వేసిన దానికన్నా దాదాపు 8 రోజులు ముందస్తుగా కేరళకు రుతుపవనాలు రావడం గత 16 ఏళ్లలో ఇదే తొలిసారి. 2009లో మే 23న వచ్చాయి. ఈ ప్రభావంతో కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల వర్షాల ధాటికి వృక్షాలు సైతం నేల కూలాయి. దీంతో ట్రాఫిక్‌ అస్తవ్యస్థమైంది. పలు జిల్లాల్లో ఇప్పటికే రెడ్‌, ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించారు. వచ్చే రెండు మూడు రోజులు ఈ అలర్ట్‌లు కొనసాగనున్నాయి. వాతావరణ పరిస్థి తులు అనుకూలిస్తే మరో రెండు మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ లోకి, మహారాష్ట్రలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని భావిస్తు న్నట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండి)శనివారం తెలిపింది. ఈఏడాది సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదయ్యే అవకాశం వుందని ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది.

వాయుగుండంగా మారిన అల్పపీడనం

తూర్పు, మధ్య అరేబియా సముద్రంలో దక్షిణ కొంకణ్‌ తీరానికి సమీపంలో వాయుగుండం గడిచిన 6 గంటల్లో 5 కిలోమీటర్ల వేగంతో తూర్పువైపునకు నెమ్మదిగా కదులుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. వాయుగుండం రత్నగిరి సమీపంలోని దక్షిణ కొంకణ్‌ తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ ప్రభావంతో పశ్చిమ తీరంలో భారీగా వర్షాలు కురిసే అవకాశం వుందని వివరించింది.

27న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం

ఈ నెల 27న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో రాష్ట్రంలో రానున్న మూడురోజులు అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎమ్‌డి రోణంకి కూర్మనాథ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్లు వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నెల 25న అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఈ నెల 26న అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, ఏలూరు, ఎన్‌టిఆర్‌, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో విస్తృతంగా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.


  • Newer

    ముందుగానే పలకరించిన నైరుతి

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">