-నృసింహుడి పాద స్పర్శతో పులకించిన పవిత్ర స్థలం
-భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువుగా పెన్నోబులేసుడు
-ఆకుపూజలంటే స్వామి వారికి బహు ప్రీతి
-ఆకుపూజ చేయిస్తే 41 రోజుల్లో కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం
-నేటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
-ఈ నెల '17 న' మహా రథోత్సవం
ఉరవకొండ: మే 08 (ప్రజాతేజం)
ఇందుగలడందులేడని సందేహము వలదు...అంటూ సర్వాంతర్యామి అయిన ఆ భగవంతుని గురించి పూర్వం చిన్ని బాలుడు ప్రహ్లాదుడు మనస్పూర్తిగా నమ్మి ఆ భగవంతుని అనుగ్రహం పొందటమేగాక, నమ్మినవారిని కాపాడటానికి భగవంతుడు ఏ రూపంలోనైనా, ఏ స్ధలంలోనైనా ప్రత్యక్షమవుతాడని నిరూపించాడు.అది పురాణకాలం. నేటికీ భగవంతుడు శంఖ చక్రాలతో, నాలుగు చేతులతో ఎదురుగా ప్రత్యక్షం కాకపోయినా నమ్మినవారికి తన ఉనికిని తెలియబరుస్తూనే వున్నాడు.
అందుకే భక్తులు భగవంతుని పూర్తి రూపంతోనే కాదు, ఆయనదిగా చెప్పబడే దేనికైనా భక్తి శ్రధ్ధలతో నమస్కరిస్తారు..పూజిస్తారు.
అలాంటి ఒక నరసింహ క్షేత్రమే పెన్నహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రం. ఇక్కడ స్వామి కుడికాలు పాద ముద్ర పైన ఆలయం నిర్మింపబడింది.
క్షేత్రం
బ్రహ్మాండ పురాణంలో, పద్మి పురాణంలో ప్రస్తావించబడిన ఈ క్షేత్రానికీ, శ్రీ నరసింహస్వామి నవ నారసింహ రూపాలతో వెలుగొందే అహోబిల క్షేత్రానికీ అవినాభావ సంబంధం వున్నదని చెబుతారు.
అక్కడ నరసింహస్వామిది ఉగ్ర రూపం,ఇక్కడ శాంతి నారసింహుడుగా కొలువయ్యాడు ఈ ఆలయం గోపురం ప్రక్కనే చిన్న గుట్టపై నెలకొల్పిన పెద్ద ఎత్తైన నరసింహస్వామి విగ్రహం దూరంనుంచే కనిపిస్తాడు.
పురాణాలద్వారా తెలిసిన చరిత్ర
త్రేతా యుగంలో ఈ ప్రాంతమంతా దట్టమైన అరణ్యం. ఋష్యశృంగ మహర్షి, శాంతల పుత్రుడు యాదపి చిన్నతనం నుంచి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భక్తుడు.
ఆయన ఈ కొండపై ఘోర తపస్సు చేశాడని. ఆయన తపస్సుకి మెచ్చి స్వామి సాక్షాత్కరిస్తే ఆయన స్వామిని అక్కడ జ్వాల,అహోబిల నరసింహస్వామిగా కొలువుండమని ప్రార్ధించాడట. స్వామి వారు ఆయన కోరిక తీర్చాడని.ద్వాపర యుగంలో ఉద్దాలక మహర్షి ఆశ్రమమిక్కడ వుండేదని.ఆ ఆశ్రమానికి సమీపంలో ఒక పెద్ద బిలం వుండేదని ఆయన శిష్యులకు విద్యని బోధిస్తూ సమీపంలో వున్న బిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ధ్యానిస్తూ చాలా కాలం గడిపేవాడు. ఆయన ధ్యాన నిష్టకు ప్రసన్నుడైన స్వామి ఒక రోజు ఆయనకు స్వప్నంలో సాక్షాత్కరించి నీ అభీష్టమేమిటని అడిగాడని. మహర్షి స్వామిని అక్కడ కొలువై వుండమన్నాడని.అందుకు స్వామి తన కుడి పాద ముద్రను ఆ బిల ముఖ ద్వారమున ప్రతిష్టిస్తానని చెప్పి అదృశ్య మయ్యాడని.
మర్నాడు నిద్రలేచిన ఉద్దాలక మహర్షి ఆ బిల ద్వారం వద్దకు వెళ్ళి పరీక్షించగా, బిల ముఖద్వారంలో స్వామి కుడి పాద ముద్ర స్పష్టంగా దర్శనమిచ్చిందని
అప్పటి నుంచీ ఆయన ఆ పాదానికి పూజలు చేస్తూ దానికి చిన్న ఆలయాన్ని నిర్మించారని.ఈ పాద ముద్ర స్వామి స్వయంగా వేసినది గనుక ఈ క్షేత్రం పవిత్ర క్షేత్రంగా అనతి కాలంలోనే ప్రసిధ్ధికెక్కింది. స్వామి పాదాన్ని పూజిస్తూ భక్తులు స్వామినే పూజించినట్లు భావించేవారు.
స్వామి పాదానికి అభిషేకం చేసిన జలం కింద వున్న బిలంద్వారా వెళ్ళి దగ్గరలోనే వున్న పెన్నానదిలో కలుస్తుందని,ఆ నదిలో స్నానం చేసినవారి పాపాలన్నీ హరించిపోతాయనీ భక్తులు విశ్వసిస్తున్నారు.
కాలగమనంలో కొంతకాలం ఈ క్షేత్రం మరుగున పడిపోయింది.
కానీ స్వామి స్వయంభువుడిగా వెలిసి,ఎంతో మంది ఋషులచేత పూజించబడ్డ పుణ్య క్షేత్రాలు శాశ్వతంగా కనుమరుగు కావు. తిరిగి ఏదో విధంగా వెలుగులోకి వస్తాయి. తర్వాత కాలంలో....క్రీ.శ. 7, 8 శతాబ్దాలలో ఈ క్షేత్రం తిరిగి వెలుగు చూసింది. అక్కడికి సమీపంలో వున్న గొల్లపల్లె అనే గ్రామం .. పేరుకు తగ్గట్లే పాడిపశువుల నిలయం.
ఆ గ్రామంలో ఒక తెల్ల ఆవు కొండపైగల బిల ముఖ ద్వారము దగ్గర క్షీరమునిచ్చి వచ్చేది.
దాని యజమాని ఆవు పాలు
ఇవ్వక పోవటంతో ఏమయిందా అని దిగులుపడసాగాడు ఆవు యజమానికి ఒక రాత్రి అతని స్వప్నంలో స్వామి సాక్షాత్కరించి
ఆ పాలు తానే తాగుతున్నానని,
ఆ కొండపై ఒక పుట్ట,దాని పక్కనే బిలము వున్నాయని, ఆ బిలము తవ్వితే తను కనబడతానని చెప్పాడు. ఆ ఆవు యజమాని అమితాశ్చర్యంతో స్వామి చెప్పిన ప్రకారం చెయ్యగా అక్కడ జీర్ణస్ధితికి చేరిన ఆలయగోపురం,బిలము, బిల ముఖద్వారమున స్వామి పాద ముద్ర, కొండకింద భాగంలో నైరుతి దిశలో శ్రీ లక్ష్మీదేవి విగ్రహం కనిపించాయట.ఆ ఆలయాలను పునరుధ్ధరించి, నిత్యపూజలు చేశారు.
తర్వాత కాలంలో ఆ గొల్లపల్లె గ్రామం జాడ కూడా లేకుండా కాలగర్భంలో కలిసిపోయింది.
తర్వాత 9వ శతాబ్దంలో రాజేంద్రచోళుడనే చోళరాజు ఆ దోవలో వెళ్తూ, కాక తాళీయంగా ఈ దేవాలయాన్ని చూశారు.గోపురం, ప్రాకారాలతో వున్న ఈ ఆలయం పాదముద్రికపై ఆలయం వుండటం చూసి ఆశ్చర్యపోయాడట. అప్పటికే ఈ క్షేత్రం పునరుధ్ధిరంపబడింది గానీ,
దానికి కారకులెవరో తెలియదు. రాజేంద్రచోళుడు అప్పటికే తంజావూరులోని బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు.
ఆయన, పెన్నహోబిలంలో కొండ కిందవున్న లక్ష్మీదేవి ఆలయ గోపురాన్ని బాగుచేయించి,
శ్రీ నరసింహస్వామి,లక్ష్మీదేవి, భూదేవిల పంచలోహ ఉత్సవ విగ్రహాలను ఆలయానికి సమర్పించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. 15వ శతాబ్దంలో ఈ పుణ్యక్షేత్రము చాలా వైభవంతో విలసిల్లినది. క్రీ.శ. 1565 విజయనగర రాజు, తుళువ సదాశివ రాయలు తన దిగ్విజయ యాత్ర ముగించుకుని పెనుగొండనుంచి రాజధాని విజయనగరానికి వెళ్తూ ఈ క్షేత్రాన్ని దర్శించాడు. కొంత జీర్ణావస్ధకి చేరిన ఈ క్షేత్రాన్ని పునరుధ్ధరించమని తన సామంత రాజులని ఆజ్ఞాపించాడు. అప్పుడు ఉరగాద్రి (ప్రస్తుతం ఉరవకొండ)ని పాలించే రాజు ప్రతినిధి అప్పలరాజు అయ్యంగార్, ఉదిరిపికొండ రాజప్రతినిధి ఉదిరప్పనాయుడు ఆలయ ప్రాకారాలని, రాజగోపురాలను, గర్భగుడి గోపురాన్ని ద్రావిడ వాస్తుకళా పధ్దతుల్లో తమ ప్రభువు సదాశివ రాయల పేరు పునరుధ్దిరింపచేశారు. అప్పుడే అప్పలరాజు అయ్యగారి భార్య అమ్మవారి ఆలయాన్ని పూర్తిగా పునరుధ్దరింపచేసినట్లు దేవాలయంలో వున్న శిలా శ్యాసనం ద్వారా తెలుస్తున్నది. రాజు ప్రతినిధులిద్దరూ నాలుగువైపుల గోపురాలకి మెట్లు ఏర్పాటు చేశారు. వీటిలో దక్షిణ దిశలోని గోపురం కొంచెం చిన్నదిగా వుంటుంది. ఈ గోపురం చిన్నదిగా వుండటానికి కారణం తెలియదు. దీనిని పాలగోపురం అంటారు.
ఒక గొల్ల వనిత పాలు అమ్మగా వచ్చిన డబ్బుతో ఈ గోపురాన్ని నిర్మింప చేసిందని ప్రజలు చెప్పుకుంటారు.
ఉదిరప్పనాయుడు ఆలయ పునరుధ్దరణతో బాటు దాదాపు 50 అడుగుల ఎత్తున్న ఏకశిలా ధ్వీప స్తంభమును, సదాశివరాయల దిగ్విజయ యాత్రకు గుర్తుగా మరొక ఏకశిలా స్తంభమును స్వామి గర్భగుడికి ఎదురుగా ప్రతిష్టింపచేశాడు. ఇప్పటికీ వీటిని చూడవచ్చు. ఈ ధ్వీప స్తంభములో ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో అఖండ జ్యోతిని వెలిగిస్తారు.
ఈ క్షేత్రంలో స్వామి ధూప, దీప, నైవేద్యాలకు, పాలనా ఖర్చులకు, రెండువేల ఎకరాలున్న పెన్నహోబిల గ్రామాన్ని సదాశివ రాయలు దానం చేసినట్లు ఆలయంలో వున్న శిలా శాసనంద్వారా తెలుస్తున్నది.
క్రీ.శ. 1979లో శ్రీలక్ష్మీనరసింహస్వామి పాదముద్రకు పైభాగమున
శ్రీ లక్ష్మీనరసింహస్వామి శిలా విగ్రహాన్ని ప్రతిష్టించారు.
అప్పటినుంచి,ఈ క్షేత్ర మహిమలు ద్విగుణీకృత మయ్యాయని భక్తులు భావిస్తున్నారు.
విశేషాలు
స్వామి కొండ కింద వున్న శ్రీ లక్ష్మీదేవి ఆలయంలో అమ్మవారి ముందు ఒక పుట్టు శిల వున్నది. దీనిని భక్తులు భూదేవిగా ఆరాధిస్తూంటారు. ఉగ్ర నరసింహ స్వామి శాంతించి, చెంచు లక్ష్మితో వన విహారం చేస్తుండగా భూదేవి ఖిన్నురాలై, భూగర్భాన కృంగిపో సాగిందిట. అప్పుడు స్వామి ఆమె శిగబట్టి బయటకి లాగాడట. పుట్టుశిలకు ఒకవైపు కొప్పున్నట్లు ఎత్తుగా కనబడుతుంది. ఇక్కడే ఎత్తయిన పీఠంపై లక్ష్మీదేవిని ప్రతిష్టించారు.
స్వామి పాదముద్ర కింద బిలం వున్నది. ఈ బిల మార్గము క్షేత్రానికి పడమ దిక్కులో ప్రవహిస్తున్న పెన్నానది దాకా వున్నదని భావిస్తారు. స్వామి పాదానికి అభిషేకము చేసిన జలము ఆ బిలం ద్వారా వెళ్ళి పెన్నానదిలో కలుస్తుందనీ,అందుకే ఈ నదీ స్నానం సకల పాపహరనమణి నమ్మకం.ఈ జలం క్షేత్రానికి దిగువ భాగంలో నైరుతి దిశలో వున్న జువ్విచెట్టు ఊడలలో ఊట జల రూపంగా ఎంతో కాలంనుంచీ ప్రవహిస్తూ బసవన్న కోనేరులో పడుతోంది.ఈ క్షేత్రానికి వచ్చే భక్తులు ఈ కోనేటిలో స్నానంచేస్తే అన్ని రకాల రుగ్మతలూ పోతాయని భక్తులు నమ్ముతారు.
ఈ క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలనే ప్రయత్నంలో అప్పటి జిల్లా కలెక్టరు శ్రీ సోమేష్ కుమార్ గారు నృసింహావతారం ఆవిర్భావాన్ని తూర్పు ద్వారం పక్కన రహదారికి ఎదురుగా నిర్మింపచేశారు.
ఈ విగ్రహాలు దూరంనుంచే దర్శించవచ్చు.2007లో జరిగిన ఒక సంఘటన స్వామి అనంతలీలలు తెలియజెయ్యటమే గాక భగవంతుడు కుల మతాలకు అతీతుడని తెలియజేస్తుంది.
ఒక ముస్లిం వ్యక్తి కుమారుడికి హటాత్తుగా రెండుకాళ్ళు చచ్చు పడి పోయాయని ఎన్ని వైద్యాలు చేయించినా ఫలితం లేకపోయింది. మిత్రుల సలహామీద ఆయన కొడుకుని ఎత్తుకుని, పెన్నహోబిల స్వామిని దర్శించి బసవన్న కోనేటి జలాన్ని నాలుగు వారాలు పిల్లవాడికి తాగించాడుట. ఐదవ వారం అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆ పిల్లవాడు తనంత తాను మెట్లెక్కి స్వామి దర్శనం చేసుకున్నాడని చెబుతుంటారు.
స్వామి వారికి ఆకుపూజ అంటే ప్రీతి
ఇక్కడ కొలువైన శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారికి ఆకు పూజలంటే బహుప్రీతి అంటారు..స్వామి వారికి ఆకు పూజలు కట్టించి మొక్కులు నివేదిస్తే 41 రోజుల్లో కోర్కెలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
అదేవిధంగా ఉద్భవ
లక్ష్మీ అమ్మ వారిని ప్రసన్నం చేసుకొనే విధంగా అవివాహితులు, సంతాన హీనులు పట్టువస్త్రాలను సమర్పించి కుంకుమార్చనలు చేస్తే తమ కోర్కెలు నెర వేరుతాయని సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం.
భగిరి గుండ్ల ప్రాముఖ్యత
స్థానిక దేవస్థానం నుంచి రెండు కి.మీ దూరంలో ఉన్న భగిరిగుండ్ల అటవీప్రాంతంలో ఉగ్ర నరసింహస్వామి వెలసి ఉన్నారు. ఉగ్ర నరసింహస్వామి పరమ భాగవతోత్తముడైన ప్రహ్లాదుని ప్రార్థనలకు శాంతించి చెంచు లక్ష్మిని తన వెంట బెట్టుకొని వన విహారంగా వ్యాహాళికి ఈ అరణ్య ప్రాంతానికి వచ్చి వరాహ రూపంలో ఉన్న ఒక రాక్షసున్ని తరిమి తరిమి భగిరి గుండ్లపై సంహరించినట్టు పెద్దలు చెబుతున్నారు.
అందుకు సంబంధించిన ఆనవాళ్లు ఇక్కడ ఇప్పటికీ కనబడతాయి.
స్వామి వారికి బ్రహ్మ రథోత్సవం తర్వాత రెండవ రోజున భక్తులు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తారు.
క్షేత్రంలో చూడదగిన ప్రదేశాలు
లక్ష్మమ్మ కోనేరు,అక్కడ ఉన్నరెండు జలపాతాలు,చెట్లతొర్రల నుంచి వచ్చేనీరు,అందంగా నిర్మించిన పాలగోపురం భక్తులను సందర్శకులను ఎంతో ఆకర్షిస్తున్నాయి.
ఇలా ఒక వైపు పుణ్యక్షేత్రంగా,
అటు ఆధ్యాత్మిక క్షేత్రంగా మరో వైపు పర్యాటక క్షేత్రంగా భక్తులను ప్రజలను విశేషంగా ఆకట్టుకొంటోంది మన పెన్నహోబిలం..
మే 9 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
పెన్నహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో మే 9 నుంచి మే 20 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో రమేష్ బాబు, ఆలయ అర్చకులు ద్వారకానాథ్, బాలాజీ స్వామి వారు తెలిపారు.
9న శుక్రవారం రోజున అమిద్యాల గ్రామం నుండి పెన్నహోబిలంకు మేళా తాళాలు బాజా భజంత్రీలు మధ్య ఉత్సవ విగ్రహాలను పెన్నాహోబిలంకు తీసుకురావడం జరుగుతుంది.
10న శనివారం ఉదయం ధ్వజారోహణం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. 17న బ్రహ్మరథోత్సవం జరుగుతుందని పేర్కొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
వాహన సేవ వివరాలు
10-05-2025 (శనివారం)
సుప్రభాతం,మహా అభిషేకం,అలంకరణ, ధ్వజారోహణం, భలిహరణ,మహా మంగళ హారతి, (ఉ|| 8 గం"కు ) అనంతరం సాయంత్రం (6:30 గం ")ప్రాకారోత్సవం.
11-05-2025 (ఆదివారం) ఉదయం 8" గంటలకు సింహ వాహనోత్సవం, సాయంత్రం చంద్రప్రభ వాహనోత్సవం
12-05-2025 (సోమవారం) ఉదయం 8"గం గో వాహనోత్సవం సాయంత్రం శేష వాహనోత్సవం.
13-05-2025 (మంగళవారం) హంస వాహనోత్సవం.
14-05-2025 (బుధవారం) సాయంత్రం హనుమంత వాహనోత్సవం.
15-05-2025 (గురువారం) సాయంత్రం గరుడ వాహనోత్సవం, రాత్రికి కల్యాణోత్సవం
16-05-2025 (శుక్రవారం)
ఉదయం 8 గం" సూర్యప్రభ వాహనోత్సవం, సాయంత్రం ఐరవత వాహనోత్సవం
17-05-2025 (శనివారం)
బ్రహ్మరథోత్సవం...
ఉదయం 11గం" మడుగుతేరు, సాయంత్రం మహారథోత్సవం,
రాత్రికి దుళోత్సవం.
18-05-2025 (ఆదివారం) రాత్రి అశ్వవాహనోత్సవం,అనంతరం పార్వేటి ఉత్సవం
19-05-2025 (సోమవారం)
ఉదయం వసంతోత్సవం, రాత్రికి శయణోత్సవం
20-05-2025 (మంగళవారం)
శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి ఉత్సవ విగ్రహాలను తిరిగి అమిద్యాల గ్రామానికి తీసుకెళ్లడంతో బ్రహ్మత్సవాలు ముగిస్తాయి.