వినతిపత్రం అందజేస్తున్న వెంకటరమణ కోలా
కదిరి ఏప్రిల్ 18 (ప్రజా తేజమ్) : రాష్ట్రంలో ఔత్సాహిక దళిత పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ప్రత్యేక ప్రోత్సహకాలు ఇవ్వాలని దళిత ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ ( డిక్కీ) రాయలసీమ జోనల్ ప్రెసిడెంట్ వెంకట రమణ కోలా కోరారు. ఈ మేరకు గురువారం 17న 16వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అరవింద్ పనగరియా, కమిటీ సభ్యులతో తిరుపతి కలెక్టరేట్ లో జరిగిన సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. కమిషన్‌బృందంతో చర్చించిన పలు అంశాలపై శుక్రవారం పట్టణంలోని రోడ్లు భవనాలు అతిథి గృహం వద్ద ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పారిశ్రామికంగా దళితులను ప్రోత్సహించడానికి అనేక అంశాలతో కూడిన ప్రతిపాదనలు కమిటీ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ముఖ్యంగా ఐదు ప్రధాన అంశాలపై కమిషన్ ఛైర్మన్‌తో చర్చించామన్నారు.అందులో మొదటి అంశం దళిత పారిశ్రామిక వేత్తలు, ఔత్సాహిక వ్యాపార, నిరుద్యోగ యువత పారిశ్రామికంగా స్థిరపడాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం కీలకమన్నారు. కేంద్ర ఆర్థిక సంఘం సూచనలతో ఎస్సీ ఎస్టీ వర్గాలకు ప్రోత్సాహం లభిస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న క్రెడిట్ లింక్డ్ ఇన్వెస్టమెంట్ సబ్సిడీని 25శాతం నుండి 45శాతానికి పెంచాలని ఆయన సూచించారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక గ్రాంటు ఇస్తున్న తరహాలోనే ఎస్సి ఎస్టీ వర్గాలకు ప్రత్యేక పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న క్రెడిట్ గ్యారెంటీ పథకాన్ని అమలు చేయడంలో వాణిజ్య బ్యాంకులు నిరాదరణ చూపుతున్నాయని, దాన్ని సక్రమంగా అమలు జరిపించి మొదటి తరం దళిత పారిశ్రామిక వేత్తలకు ఆర్థిక భరోసా కల్పించి వికసిత భారత్ లో సుస్థిర స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు.