- : 70 రోజుల్లో హంద్రీనీవా కాలువ వెడల్పును పూర్తి చేయాలని ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాం..
- : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సంక్షేమాన్ని, అభివృద్ధిని సమతూకంలో ముందుకు తీసుకెళ్తున్నాం
- : రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్
- : బెలుగుప్పలోని వాసవి కల్యాణ మండపం పక్కన ఉన్న స్థలంలో నిర్వహించిన ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ తో కలిసి అర్జీలను స్వీకరించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్..
బెలుగుప్ప/ ఉరవకొండ, ఏప్రిల్ 09 (ప్రజా తేజమ్) :
- అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే పనులన్నీ పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకుని పని చేస్తున్నామని, 70 రోజుల్లో హంద్రీనీవా కాలువ వెడల్పును పూర్తి చేయాలని ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నామని రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. బుధవారం బెలుగుప్ప మండల కేంద్రంలోని వాసవి కల్యాణ మండపం పక్కన ఉన్న స్థలంలో మండల స్థాయిలో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించగా, ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ తో కలిసి రాష్ట్ర ఆర్థిక మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ పాల్గొని ప్రజల నుంచి 713 అర్జీలను స్వీకరించారు.
- ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ రాజకీయాల్లో 30 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం చేసిన తనకు మీరు అందించిన అవకాశంతో తాను ఈ స్థాయికి చేరుకున్నానన్నారు. తాను ఎక్కడ ఉన్నా తన గుండెచప్పుడు ఉరవకొండ నియోజకవర్గంలోని పల్లెల్లోనే ఉంటుందన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే పనులన్నీ పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకుని పని చేస్తున్నామన్నారు. రాష్ట్రానికి మంత్రినైనా ఉరవకొండ నియోజకవర్గానికి, జిల్లాకు మొదటి కూలీగానే పనిచేస్తానని, తనలో మార్పు రాదు, లేదన్నారు. నియోజకవర్గంలోని హంద్రీనీవా కాలువకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక ప్రాజెక్టుకు 3,800 కోట్లకు పైగా నిధులను కేటాయించలేదని, అనంతపురం జిల్లా ప్రాజెక్టు అయిన హంద్రీనీవా కాలువ వెడల్పు చేసే కార్యక్రమాన్ని 3,800 కోట్ల నిధులతో మొదటి, రెండవ దశలలో మంజూరు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 70 సంవత్సరాలలో ఇంత పెద్దఎత్తున నిధులు ఏ ప్రాజెక్టుకు విడుదల చేయలేదని, జిల్లా ప్రజల రుణం తీర్చుకోవడానికి ఈ ప్రాజెక్టు చేపట్టామని, పై నుంచి నీళ్లు వస్తేనే బెలుగుప్ప మండలానికి, రాయదుర్గం, కళ్యాణదుర్గంకు, బిటిపికి, మిగిలిన వాటికి నీళ్లు పోతాయన్నారు. ప్రధానంగా 70 రోజుల లక్ష్యంతో హంద్రీనీవా కాలువ వెడల్పును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 2014లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరిగేషన్ మంత్రిని తీసుకువచ్చి కాలువలపై తిప్పి సమస్యలను పరిష్కరించి ఆరు మోటర్లను పనిచేసేలా చేసామని, ఈరోజుకి అవే ఆరు మోటర్లు పనిచేస్తున్నాయని, గత ఐదేళ్లలో ఒక గంప మన్ను కూడా తీయలేదన్నారు. ఎన్ని సమస్యలు ఉన్నా హంద్రీనీవా పనులు ప్రారంభించామని, 70 రోజుల్లోనే పనులు పూర్తిచేసేలా చూస్తున్నామని, 10 నుంచి 12 మోటర్లు ఆన్ చేసేలా పని చేస్తున్నామన్నారు. ఈ ప్రభుత్వ మా కోసం పని చేస్తోందని జిల్లా రైతాంగానికి ఒక నమ్మకం ఇవ్వడానికి కాలువ వెడల్పును చేపట్టామన్నారు. మెయిన్ కాలువ పూర్తిపై ప్రధానంగా దృష్టిపెట్టామని, తర్వాత మిగిలిన కాలువలపై దృష్టి పెడతామన్నారు. మండలంలోని గోళ్ళ నుంచి బెలుగుప్పకు వచ్చే రహదారికి నిధులు మంజూరు చేశామని, కాలువపల్లి నుంచి జీడిపల్లికి వచ్చే రోడ్డు, బూదిగుమ్మ, కోనాపురం కావచ్చు, ఇంకా చేయాల్సినవి ఎన్నో ఉన్నాయని, అనేక సమస్యలను పరిష్కారం చేయాల్సి ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి రాష్ట్రంలో వచ్చే ఆదాయం, పన్ను వసూలు ఆదాయం మొత్తం జీతాలు, పెన్షన్లు ఇవ్వడానికి, పాత ప్రభుత్వం చేసిన అప్పులు, వడ్డీలు కట్టేందుకు సరిపోతోందని, ఒక రూపాయి మిగడం లేదని, అదిగాక టీచర్లు, స్కూల్స్, చిన్నపిల్లలు, ఆస్పత్రులు లాంటివన్నీ నడపాలన్నారు. అభివృద్ధి పనులు చేయాలంటే రేయింబవళ్లు కష్టపడి ఎక్కడ రూపాయి దొరికితే అక్కడ తెచ్చుకొని పెట్టుబడులు పెడితే తప్ప మన ప్రాంతం అభివృద్ధి కానటువంటి పరిస్థితి ఉందన్నారు. ప్రజలు ఇచ్చిన సహకారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో సంక్షేమాన్ని, అభివృద్ధిని సమతుకంలో తీసుకెళ్తున్నామన్నారు. తల్లికి వందనం కార్యక్రమం కింద రాబోయే రెండు నెలల్లో పాఠశాలలు ప్రారంభమయ్యే లోపల డబ్బులు అందిస్తామన్నారు. రైతన్నల కోసం అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ఉరవకొండ నియోజకవర్గంలో శరవేగంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. ఉరవకొండలో కమ్యూనిటీ హాల్ ల నిర్మాణానికి అన్ని కులాలకు ఊహించని విధంగా నిధులు మంజూరు చేశామని, సంవత్సరంలోనే కమ్యూనిటీ హాల్ ల పనులన్నీ పూర్తి చేస్తామన్నారు. నా ముందున్నవి మంచినీళ్లు, కాలవలు ప్రధాన సమస్యలని, రాబోయే కాలంలో ప్రాధాన్యత పెట్టుకుని పనులను చేపడతామన్నారు. ఎప్పుడో కాలువలు తవ్వినా డబ్బులు ఇవ్వలేదని, తాను వచ్చిన తరువాత ఒక్క బెలుగుప్ప మండలానికి 40-50 కోట్ల రూపాయలను విడుదల చేశామన్నారు. తాను ఎక్కడ ఉన్నా మీకోసమే పని చేస్తూనే ఉంటానన్నారు.
- ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి సంబంధించి అర్జీలను రాసేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించామని, కంప్యూటర్లో నమోదు చేసుకునే అధికారుల టీంని ఏర్పాటు చేశామని, జిల్లా అధికార వ్యవస్థ ఇక్కడికి తరలివచ్చిందని, ఇందుకు జిల్లా కలెక్టర్ కి ధన్యవాదాలు తెలిపారు. డ్రిప్ ఇరిగేషన్ లో దేశంలోనే నెంబర్ 2 స్థానంలో నిలవడం పట్ల జిల్లా కలెక్టర్ ని, జిల్లా అధికార యంత్రాంగాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. సిమెంటు రోడ్ల నిర్మాణంలో కూడా రాష్ట్రంలో మనం నంబర్ 2 లో ఉన్నామన్నారు. సిమెంట్ రోడ్లు, గోకులం షెడ్ల నిర్మాణంలో ఎక్కడా వెనక్కి తగ్గలేదని, వారికి సంబంధించిన నిధులను కూడా త్వరలోనే విడుదల చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఇచ్చిన అర్జీలను కంప్యూటర్లో నమోదు చేశాక సంబంధిత అధికారులకు వెళుతుందని, జిల్లా అధికారులు క్షేత్రస్థాయి అధికారులకు తెలియజేస్తారని, వారు అర్జీదారుల ఇంటికి వెళ్లి విచారణ చేసి సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అర్జీలకు ఏ రకమైన పరిష్కారం చేయగలమో, ప్రభుత్వంలో చేయగలిగిన పని అయితే ఖచ్చితంగా ఆ పనిని చేసి మళ్లీ మీ ఇంటికి వచ్చి పని పూర్తయిందని అధికారులు తెలియజేస్తారన్నారు. పరిష్కరించలేకపోతే ఏమి ఇబ్బంది ఉందనేది తెలుపుతారన్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో ప్రజలు, నాయకుల పనులు ఆగకూడదని నిరంతరం పని జరుగుతుండాలనే వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. అర్జీలను పరిష్కరిస్తామని, చివరి వరకు పనిచేస్తూనే ఉంటామని తెలిపారు.
- ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రతిష్టాత్మకంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తీసుకువచ్చారని, ఎటువంటి సమస్యలు లేకుండా పరిష్కరించాలని ఆదేశించారన్నారు. జిల్లా కేంద్రంతోపాటు నియోజకవర్గాలలో కూడా పిజిఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, మంగళవారం నుంచి మండల స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. అర్జీలలో క్లుప్తంగా సమస్యను తెలియజేయాలని, సమగ్రంగా అర్జీ అందిస్తే వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కొన్ని రోజుల క్రింద ఉరవకొండ నియోజకవర్గంలో మంత్రి డ్రిప్ పరికరాలను పంపిణీ చేయడం జరిగిందని, ఆర్థిక శాఖ మంత్రి చొరవతో రాష్ట్రం మొత్తం పెండింగ్ ఉన్న బిల్లులను క్లియర్ చేయడం జరిగిందని, అలాగే అనంతపురం జిల్లాకు అతి ఎక్కువగా లక్ష్యాన్ని కేటాయించడం జరిగిందని, ఆంధ్రప్రదేశ్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలోనే లక్షకుపైగా హెక్టార్లలో సూక్ష్మసేద్య పరికరాలను మంజూరు చేయడంలో ప్రథమ స్థానంలో ఉందన్నారు. అంతేకాకుండా జిల్లాల వారీగా చూస్తే భారతదేశంలో ఉమ్మడి అనంతపురం జిల్లా బెస్ట్ పర్ఫామెన్స్ లో 6వ స్థానంలో ఉండేదని, 2024లో 17వ స్థానంలో ఉందని, 2024-25లో గుజరాత్ రాష్ట్రంలోని బనస్కoత అనే జిల్లా మొదటి స్థానంలో ఉండగా, అనంతపురం జిల్లా రెండవ స్థానంలో నిలిచిందని, మన జిల్లాకు 18 వేల హెక్టార్లలో లక్ష్యం ఇస్తే 17,642 హెక్టార్ల లక్ష్యాన్ని పూర్తి చేయడం జరిగిందని, దేశంలో రెండో స్థానంలో నిలవడం గర్వకారణంగా ఉందన్నారు. ఇందులో ఆర్థిక శాఖ మంత్రి కృషి ఎంతో ఉందని, పెండింగ్ పేమెంట్ ని వెంటనే విడుదల చేయించారని, అదనపు లక్ష్యం ఇచ్చారని, మంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు.
- ఈ సందర్భంగా ఐసిడిఎస్ పరిధిలో లోప పోషణ రహిత అనంత, ఏడవ పౌష్టికాహార పక్షోత్సవం పోస్టర్లను మంత్రి, జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో ఎనిమిదో తరగతి చదువుతున్న కేజీబీవీ, మోడల్ స్కూల్ విద్యార్థినీలకు ట్యాబ్ లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఏ.మాలోల, జిల్లా ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారి రామకృష్ణారెడ్డి, ఆర్డీఓ వసంతబాబు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు తిప్పేనాయక్, మల్లికార్జున, ఎంపిపి పెద్దన్న, సర్పంచ్ సాలీబాయి, వైస్ ఎంపీపీ పుష్పావతి, ఎంపీటీసీ శకుంతలమ్మ, సిపిఓ అశోక్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ, జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ రామసుబ్బారెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ శ్రీనివాస యాదవ్, పశుసంవర్ధక శాఖ జెడి వెంకటస్వామి, డిపిఓ నాగరాజునాయుడు, బిసి వెల్ఫేర్ డిడి కుష్బూ కొఠారి, ఎపిఎంఐపి పిడి రఘునాథరెడ్డి, ఆర్&బి ఎస్ఈ రాజగోపాల్, డిఎంహెచ్ఓ డా.ఈబి.దేవి, జిల్లా పరిషత్ సిఈఓ రామచంద్రారెడ్డి, డిఆర్డిఏ పిడి ఈశ్వరయ్య, పిజిఆర్ఎస్ తహసిల్దార్ వాణిశ్రీ, తహసీల్దార్, ఎంపిడిఓ, వివిధ శాఖల జిల్లా, నియోజకవర్గ, మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.