దేశంలోని అనేక ప్రాంతాలను ఇటీవల భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. ప్రకృతి విపత్తుల కారణంగా వందలమంది ప్రాణాలు కోల్పోగా, వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. మన దేశంలో, దక్షిణ ఆసియా ప్రాంతంలో వరదలు అసాధారణమేమీ కాదు. కానీ, వాతావరణ మార్పుల కారణంగా రుతుపవన వర్షపాతంలోనూ మార్పులొస్తుండడం తీవ్ర పరిణామాలను దారితీస్తోంది. అతి తక్కువ వ్యవధిలోనే భారీ వర్షాలు కురవడం, సుదీర్ఘ కాలం వర్షాలు లేకపోవడం వంటి అసాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ కారణంగా వాతావరణంలో తేమ గణనీయంగా పెరిగి 'అట్మాస్ఫియరిక్ రివర్స్' అనే భారీ నీటి ఆవిరి పాయలు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వీటినే ఆకాశ నదులు (ఫ్లయింగ్ రివర్స్) అంటున్నారు.