- నేడు దేవరగట్టులో కర్రల సమరం
- ఉత్సవానికి పోలీసుల పహారా
ప్రజాశక్తి – కర్నూలు ప్రతినిధి : కర్నూలు హోళగుంద మండలం దేవరగట్టులో దసరా సందర్భంగా గురువారం రాత్రి జరిగే బన్ని ఉత్సవాల్లో రక్తం చిందకుండా ఆపేందుకు పోలీసులు ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. 110 సిసి కెమెరాలు, 10 డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. సిసి కెమెరాలకు ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. డిఎస్‌పిలు, సిఐలు, ఎస్‌ఐలతో 15 రోజుల నుండి వరుసగా 20 నుండి 30 గ్రామాల ప్రజలలో అవగాహన కల్పించారు. ఇప్పటికే 200 మందిని బైండోవర్ చేశారు. దేవరగట్టు పరిసర ప్రాంతాలలో ఐదు చెక్ పోస్టులు, పది పికెట్లు ఏర్పాటు చేశారు. బన్ని ఉత్సవానికి ఇద్దరు అడిషనల్ ఎస్‌పిలు, ఏడుమంది డిఎస్‌పిలతో పాటు 800 మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. అగ్గి దివిటీలు, ఇనుప రింగులు తొడిగిన కర్రలను నిషేధించారు. ఇప్పటికే 340 రింగులు తొడికిన కర్రలను స్వాధీనం చేసుకున్నారు. దేవరగట్టు కొండ పరిసర ప్రాంతాలైన సులువాయి, మునానుగుంది, అరికెర, కొండపైకి వెళ్లే దారిలోని బిలేహల్ వంటి పది చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. వాహనాలను కొండ దగ్గరకు అనుమతించడం లేదు.
ఆగని రక్తపాతం
ఉత్సవమూర్తులను దక్కించుకోవడానికి వేలాది మంది కర్రలతో సమరానికి సై అంటూ రంగంలోకి దిగుతారు. ఒక గ్రూపు వారు విగ్రహాలను తీసుకెళ్తుంటే, మరో గ్రూపు వారు ఆపే ప్రయత్నం చేస్తారు. ఇలా రెండు గ్రూపుల మధ్య కర్రల సమరం నడుస్తుంది. అనంతరం విగ్రహాలను తిరిగి దేవరగట్టు మీద ఉంచడంతో ఉత్సవం పూర్తవుతుంది. కర్రల సమరంలో వందలాది మంది గాయాలపాలవుతారు. 2023లో 90 మందికి గాయాలు కాగా గతేడాది జైత్ర యాత్రలో రింగ్‌కర్రలు, అగ్ని దివిటీల ఆవిరితగిలి 95 మందికి గాయాలయ్యాయి. 800 మంది పోలీసులు ఉన్నప్పటికీ రింగ్ కర్రలను దేవరగట్టుకు రాకుండా ఆపలేకపోయారు. అవగాహన సదస్సులు, రింగ్ కర్రలు స్వాధీనం చేసుకున్నప్పటికీ రక్తపాతం ఆగలేదు. ఈ ఏడాదైనా కర్రల సమరానికి తెర పడుతాందా? లేదా? అనేది వేచి చూడాలి.
ఉత్సవం ముసుగులో గాయాలు చేసుకోవద్దు : విక్రాంత్ పాటిల్, కర్నూలు ఎస్‌పి.
దేవరగట్టు మాలమల్లేశ్వర స్వామి బన్ని ఉత్సవాన్ని సంప్రదాయ సంబరంగా ప్రశాంతంగా జరుపుకోవాలి. ఉత్సవాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేశాం. అన్ని శాఖల సమన్వయంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేశాం. కొందరు వ్యక్తులు కావాలనే మనస్పర్ధలు, పాత కక్షలతో దాడులకు పాల్పడుతున్నారు. బన్ని ఉత్సవం సంబరంలాగానే ఆచారించాలి. ఉత్సవంలో చిన్న పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి.