మే 19 (ప్రజా తేజమ్ ఏపీ, తెలంగాణ ప్రజలకు కూల్ న్యూస్. తెలుగు
రాష్ట్రాల్లో వారం రోజుల పాటు కూల్ వెదర్ ఉండనుంది. కొన్ని ప్రాంతాల్లో
వడగళ్ల వానలు కూడా పడే అవకాశం ఉంది. అయితే వర్షం పడేటప్పుడు చెట్ల కింద
ఉండవద్దని.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.
రాగల 2 నుంచి 3 రోజులలో దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కోమెరిన్ ప్రదేశంలోని మరికొన్ని ప్రాంతాలు, దక్షిణ, చమధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. అంతేగాక పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి అనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలో సగటు సముద్రమట్టానికి 1.5 నుండి 5.8 కిలోమీటర్ల మధ్యలో ఉపరితల చక్రవాక ఆవర్తనం కొనసాగుతుంది.
ఇక ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి ఉపరితల ఆవర్తనం, దక్షిణ కోస్తాంధ్ర తీరం రాయలసీమ మీదుగా ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు సగటు సముద్రమట్టానికి 1.5 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో.. సోమవారం, మంగళవారం, బుధవారం తెలంగాణలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాగల మూడు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉంది.
సోమవారం తెలంగాణలోని వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
మంగళవారం తెలంగాణలోని కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో ఈ 11 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
ఏపీకి భారీ వర్ష సూచన….
వచ్చే వారం రోజుల పాటు ఆంధ్రాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణం కేంద్ర వెల్లడించింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు చాన్స్ ఉందని అంచనా వేసింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాల సమయంలో 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.